మహాకవి, సినీ రచయిత- కీ:శే చందాల కేశవదాసు (1876-1956)

       తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు.

         మహాకవి, అష్టావధాని, నాటకకర్త, సినీ రచయిత స్వర్గీయ చందాల కేశవదాసు గారు, ఆయన పేరు ఈ తరానికి తెలియదు. ఆయన తొలి టాకీ చిత్రం "భక్త ప్రహ్లాద" (1932) చిత్రానికి పాటలు వ్రాసిన కవి అనిగాని, ఈ నాటికి వినిపిస్తున్న “భలే మంచి చౌక బేరము” (శ్రీకృష్ణ తులాభారము) ఆయన వ్రాసినదే! పద్య నాటకాలకు విశేషాదరణ ఉన్న ఆకాలంలో విస్తృతంగా ప్రదర్శించబడిన ఆ మాట కొస్తే "తెలుగు సినిమా పాట చరిత్ర” పరిశోధనా గ్రంథములో ఈయనను గురించి ప్రకటించేవరకు మొట్టమొదటి సినీ కవి అని చాలామందికి తెలియదు.

Chandala Kesavadasu

               చందాల కేశవదాసు గారు ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో శ్రీ చందాల లక్ష్మీనారాయణ శ్రీమతి పాపమ్మ అనే పుణ్య దంపతులకు 20-6-1876 తేదీన కాపు కుటుంబంలో జన్మించారు. తండ్రి గారికి వైద్యం, వాస్తు ప్రధానవృత్తిగా ఉండేది. సద్గ్రంద గోస్టి, పురాణ శ్రవణం, భగవద్గీత సేవలతో కాలక్షేపం చేస్తూ ఉండేవారట.

      లక్ష్మీనారాయణ గారి ఇరువురు కుమారులలో పెద్దవాడు  వెంకటరామయ్య, రెండవవాడు కేశవదాసు, వెంకట్రామయ్య ఉపాధ్యాయునిగా పని చేసేవాడు. మంచి ఉపాసనాపరులు, గంగాదేవి పాడు, సిరిపురం మొదలగు గ్రామాల్లో నివసించి అనేక మందికి గురువుగా ఉంటూ వచ్చారు. ఈయనకు తండ్రి గారి నుండి సంక్రమించిన విద్యలే వాస్తు, వైద్య విజ్ఞానం ఇతను యోగాభ్యాస నిరతుడు. ఇక రెండవ కుమారుడైన కేశవదాసు గారు అపర రామదాసు, భద్రాచల రాముడి ఆలయ నిర్మాణంలో రామదాసు తన సర్వస్వాన్ని, తనువు, మనస్సు ధనాన్నే కాకుండా, మన ప్రాణాల్ని కూడా అర్పించిన చరితార్థుడు అంతేగాక శ్రీరామచంద్రుడిని పరిపరి విధాల స్తుతిస్తూ ఒక శతకాన్ని అనేక కీర్తనలను వ్రాసి ధన్యుడైనాడు. తన సుగంధ పరిమళ భరితమైన రామభక్తి యుత జీవనంతో తెలుగువారిని తెలుగుభూమిని పునీతం చేశాడు. అదేవిధంగా కేశవదాసుగారు కూడా తన జీవితాన్నంతా సాహిత్యసేవతో బాటు శ్రీరామచంద్రస్వామి సేవలకు అంకితం చేసి, జన్మను చరితార్థం చేసుకున్న పుణ్య శ్లోకుడు.

      కేశవదాసుగారు, తిరుపతి వేంకట కవుల వలనే సాహిత్యోద్యమ జీవి, గురజాడ మహాకవి, తన సాహిత్యోద్యమాన్ని సంఘ సంస్కరణోద్యమ పతాకగా, ప్రతీకాత్మకంగా చెప్పాడు. దాసుగారు “తమ్మర” గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణైక మహెూద్యమజీవి, తన శక్తి యుక్తులన్నింటికిని శ్రీరాముని సేవకు అంకితం చేసిన భక్తాగ్రేసరుడు, స్వామి వారి ఆలయ గోపుర నిర్మాణదాసు గారి శారీరక, ఆర్థిక, హార్తిక, సేవలు ప్రముఖంగా అందాయి. దేవాలయాలు ఆస్తిపాస్తుల్ని స్వంతం కోసం కైంకర్యము చేసుకొని తమకు ఇండ్లను, వస్తు వాహనాదులను సమకూర్చుకున్న నిపుణమతులు, పెక్కురున్నారు. కాని తమ ఇంటి నిర్మాణం కోసం సమకూర్చుకున్న కలపను, రామచంద్రస్వామి రథ, గోపుర నిర్మాణానికి తరలించిన ఔదార్య విశేషగుణం అరుదనే చెప్పాలి అట్టిది. కేశవదాసు గారిలోనే చూశాము. అంతేగాక ఆలయ గాలి గోపురం నిర్మాణానికి అష్టావదానాలు చేసి హరికథలు గానం చేసి, తద్వారా లభ్యమైన ధనంతో పని పూర్తి చేయించాడు. తనకు తన కళా సరస్వతి అనుగ్రహం ద్వారా లభ్యమైన తృణమో, పణమో, ఎంతైనా, ఏదైనా, భగవద్భాగవత, కైంకర్యము చేసి వినియోగం చేసిన భాగవత, విద్వత్సేవా దురంధరుడు దాసు గారు.

            శ్రీరామనవమి వేడుకల సందర్భముగా భద్రాచల సీతారాముల కళ్యాణ వేడుకలని, దర్శించడానికి, వెళ్ళే యాత్రికులకు మధ్యలో భోజన సదుపాయములు కలిగించే ఉద్దేశ్యంలో దాసుగారు కృష్ణాజిల్లా తిరుపూరు గ్రామంలో హరికథా సప్తాహం పెట్టి అందు ప్రతిరోజు కథా కాలక్షేపం, ధార్మిక ప్రవచనాలతో పాటు యాత్రికులకు భోజన విశ్రాంతి సదుపాయాలను సమకూర్చి భాగవతుల సేవ చేసేవాడు. ఇప్పటికి ఆ ఊళ్ళో వారి సేవలకు స్మృతి చిహ్నంగా "దాసుగారి బావి" అనే మంచినీటి బావి ఉంది. ఆయన వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. శతకాలు, దండకాలు, మేలుకొలుపులు, జోలపాటలు, దేశభక్తి గేయాలు మొదలైన ప్రక్రియలో తన సామర్థ్యాన్ని నిరూపించుకొని పద్యకవిగా, అష్టావధానిగా, నాటక రచయితగా హరికథా భాగవతార్గా రాణించారు.

           హరికథలు చెప్పడయే గాక స్వయంగా “నాగదాసు చరిత్ర” విరాటపర్వము మొదలగు కథలను రచించారు. నాటక రంగం మీద మక్కువతో "కనకతార” బలిబంధనము, నాటకాలు రచించి ప్రదర్శింపచేశారు. కనకతార జానపద ధోరణిలో రాజ్యాధికారం కోసం సాగిన వీర రస ప్రధానమైన నాటకం కాగా "బలిబంధనం" భాగవతంలోని "వామన చరిత్ర" ఆధారంగా వ్రాసిన నాటకం. “కనకతార" నాయికా నాయకులకు సబంధించినది కాకుండా తార, కనకసేనుడు. అనే అక్కా తముళ్లకు సంబంధించినది కావడం విశేషం.

కనకతార నాటకాన్ని అనేక సమాజాలు వివిధ ప్రాంతాలలో 1936 సం॥లో సరస్వతీ టాకీసు వారు హెచ్.వి.బాబు దర్శకత్వంలో దానిని వెండితెరకెక్కించడం, ఆనాటక ప్రాచుర్యాన్ని తెలియచేస్తుంది. కనకతార సినిమాలో దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ ప్రధానపాత్రధారులు, కనకతార" చిత్రం ద్వారా సీనియర్ సముద్రాల సినీ రచయితగా పరిచయమయ్యారు. 1955 సం॥లో కనకతార కొత్త తారాగణంతో మరోసారి సినిమాగా వచ్చింది. నాటక పితామహా ధర్మవరం కృష్ణమాచార్యులు వ్రాసిన భక్త ప్రహ్లాద నాటకాన్నే, శ్రీకృష్ణావారు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో చలనచిత్రంగా రూపొందించారు. సినిమాలోని నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా చాలావరకు ఆ నాటకాన్ని ప్రదర్శించిన "సురభి నాట్యమండలి సభ్యులే! రామకృష్ణాచార్యులు “చిత్రనళీయం”తో ప్రారంభించిన పద్ధతి ప్రకారం ముందుగా “ప్రహ్లాద” వచన నాటకాన్ని రచించి దానికి అనుబంధంగా 40 పాటలను సమకూర్చి పద్యాలను మాత్రం పోతన భాగవతం నుండి యథాతథంగా తీసుకున్నారు. అయితే ధర్మవరం వారి తర్వాత ఆ నాటకం సురభి వారి చేతుల్లోకి వచ్చి ప్రదర్శనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులకు లోనైంది. ఈ దశలో సురభి వారి కోరిక మేరకు కేశవదాసు రచించిన మూడు పాటలు ఆ నాటకం చేరాయి. ఇవే తర్వాత సినిమాలోకి వెళ్ళాయి. అవి

1. హిరణ్యకశ్యపుడు భార్య లీలావతి పాత్రధారిణి. సురభి కమలాబాయి పై చిత్రీకరించిన "పాట" పరితావబారంబు భరియింపతరమా! కటకటా విధినెట్లు గడువంగజాలదు...

2. నారాయణ నామస్మరణ చేస్తూ తండ్రికి కోపం తెప్పిస్తున్న తనయుని ప్రహ్లాదుని తల్లి లీలావతి మందలించే సందర్భములో "తనయా ఇటులన్ బలుక తగదు....."

3. హిరణ్యకశ్యపుడు తన భార్యను ఇంద్రుడు చెరబట్టాడనే వార్త తెలిసి క్రోథముతో మండిపడే సన్నివేశంలో “భీకరంబగు నా ప్రతాపంబునకు భీతిలేక యిటు చేసేదవా.... అంటూ మూడు పాటలు భక్త ప్రహ్లాదలో కేశవదాసు వ్రాసిన పాటలు వినియోగించుకున్నారు. అందువలన చందాల కేశవదాసును తొలి సినీ కవిగా నిర్ధారించడం జరిగింది.

ఆ రోజుల్లో వృత్తి నాటక సమాజాల కోరిక మీద ఇతర కవులు వ్రాసిన ప్రసిద్ధ నాటకాలకు దైతా గోపాలం, పాపట్ల కాంతయ్య, చందాలకేశవ దాసు మొదలైనవారు కొన్ని పాటలు వ్రాసేవారు. ఆ క్రమంలో ప్రహ్లాద తర్వాత ముత్తరాజు సుబ్బారావు రచించిన “శ్రీకృష్ణ తులాభారం నాటకానికి కూడా కేశవదాసు మూడు పాటలు వ్రాశారు అవి....

1. బలేమంచి చౌకబేరము

2. మునివరా తుదకిట్లు ననున్ మోసగింతువా!,

3. కొట్టూ కొట్టండి, కొట్టండీ బుర్ర పగలగొట్టండి - అనే పాటలు "శ్రీకృష్ణ తులాభారము చిత్రాన్ని నిర్మించిన మూడు సంస్థలు (కాళి ఫిలింస్ 1935, రాజరాజేశ్వరి ఫిలింస్ చిత్రాన్ని నిర్మించిన మూడు సంస్థలు (కాళి ఫిలింస్ 1955, సురేష్ మూవీస్ - 1966) ఈ పాటలను విడిచి పెట్టలేకపోయాయి. వీటిలో "భలేమంచి చౌకబేరము” పాట అత్యంత ప్రజాదరణ పొందింది. కేశవదాసు గారు పూర్తిగా రచన అందించిన మొదటి చిత్రం ఆరోరా ఫిల్మ్ కార్పోరేషన్ “సతీ అనసూయ" (1935) దాసరి కోటిరత్నం ప్రధాన పాత్ర ధరించిన ఈ చిత్రంలో దాసుగారు 24 పాటలనూ 14 పద్యాలనూ వ్రాశారు. కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించిన రాధా ఫిలిమ్ కంబైన్స్ వారి "లంకా దహనం" (1936) చిత్రానికి కూడా చందాలవారే పాటలు, మాటలు వ్రాశారు. అయితే ఆ ప్రింటు ఇప్పుడు దొరుకుందో లేదో “కనకతార” కథ దాసు గారిదే అయినా సినిమా రచయితగా, సముద్రాల రాఘవచార్యుల వారు నియోగింపబడగా, నాటకంలోని మూడు పాటలును రెండు పద్యాలను మాత్రమే సినిమాలో దాసుగారు వ్రాసినవి వినియోగించారు.

1. "ఏ పాప మెరుగని పాపలకీ చావు".

2. దప్పిచే నాలుక తడిపొడి లేక” అనే రెండు పద్యాలు.

ఆనాడు జనం నోళ్లలో నానినవి కాగా మాండలిక పదజాలంతో రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి.

    కేశవదాసు గారు సినిమాల పనిమీద, కలకత్తా మదరాసు, బెంగుళూరు, బొంబాయి మున్నగు పట్టణాలు సందర్శించారు. ఆ రోజుల్లో కలకత్తా సినిమా నిర్మాణ కేంద్రం సతీ అనసూయ చిత్రాన్ని కలకత్తాలోని “ఆరోరా” ఫిలిం కార్పోరేషన్ వారు తీశారు. ఈ చిత్రానికి చక్కని బావగర్భితమైన స్క్రిప్టు, పాటలు, పద్యాలు, మాటలు వ్రాశారు.

ఆయన రచించిన లేదా ప్రదర్శించిన హరికథలలో ముఖ్యమైనవి:

సత్యభామా పరిణయం

సీతా కల్యాణం

రుక్మాంగద

నాగదాసు

లవకుశ

విరాటపర్వం

ఈ రచనల ద్వారా భక్తి సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేశారు. 

కేశవదాసు గారు తెలుగు నాటకరంగంలో రచయితగా, నటుడిగా, గాయకుడిగా, నాటక ప్రదర్శనల నిర్వాహకుడిగా సేవలందించారు. బాలభారతి సమాజంతో కలిసి నాటకరంగంలో పనిచేశారు.

ప్రముఖ నాటకాలు

1. కనకతార (కనక్తార)

కేశవదాసు గారి అత్యంత ప్రసిద్ధ నాటకాలలో ఇది ఒకటి. ఈ నాటకం ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగు నాటకరంగంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. 1911లో రచించబడిందని కొన్ని జీవిత చరిత్రలు పేర్కొంటున్నాయి; మరికొన్ని గ్రంథాల జాబితాల్లో 1926 సంవత్సరం కనిపిస్తుంది. అందువల్ల రచన, ప్రచురణ సంవత్సరాలను వేర్వేరుగా చూడాలి. 

2. బలి బంధనం

1935లో రచించిన ఆరు అంకాల పద్యనాటకం. పౌరాణిక ఇతివృత్తంతో కూడిన ఈ రచన ఆయన నాటకరచనా ప్రతిభను తెలియజేస్తుంది. 

ఆయన నాటకాల్లోని పద్యాలు, గేయాలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. అవసరమైనప్పుడు స్వయంగా పాత్రలు ధరించి ప్రదర్శనలకు మరింత జీవం పోసేవారు. 

1931లో విడుదలైన భక్త ప్రహ్లాద తెలుగు తొలి టాకీ చిత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రానికి కేశవదాసు గారు పాటలు రచించారు. అందువల్ల ఆయనను సాధారణంగా తెలుగు సినిమా తొలి గేయరచయితగా గుర్తిస్తారు. 

ఆ చిత్రానికి ఆయన రాసిన పాటల్లో ప్రసిద్ధమైనవి:

“తనయ ఇటులన్ తగదురా పలుక…”

“పరితాపంబు…”

“భీకరంబగు…”

ఈ గేయాలు తెలుగు చలనచిత్ర సంగీతానికి తొలి దశలోనే సాహిత్యపరమైన పునాది వేశాయి. 

ఇతర సినిమా రచనలు

శ్రీకృష్ణ తులాభారం: ఈ చిత్రంతో సంబంధించి ఆయన రచించిన ప్రసిద్ధ గేయంగా “భలే మంచి చౌక బేరము” గుర్తింపు పొందింది.

కనకతార: ఈ నాటకం ఆధారంగా రూపొందిన చిత్రానికి కూడా ఆయన రచనలు అందించారు.

సతీ అనసూయ: ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, పద్యాల రచనలో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు జీవిత చరిత్రలు పేర్కొంటున్నాయి

   తెలుగు నాటకరంగ ప్రార్థనా గీతం

కేశవదాసు గారు రచించిన “పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద…” అనే ప్రార్థనా గీతం తెలుగు నాటకరంగంలో విశేష ప్రాచుర్యం పొందింది.

నాటక ప్రదర్శనల ప్రారంభంలో ఈ గీతాన్ని ఆలపించే సంప్రదాయం ఏర్పడింది. భక్తిభావం, పదాల గంభీరత, సంగీతాత్మకత ఈ గీతానికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి.

    శ్రీరామ నామామృత గేయం

శ్రీరామునిపై ఆయనకున్న భక్తిని ప్రతిబింబించే రచన.

ఇతర ముఖ్యమైన రచనలు:

సీతాకళ్యాణం

రుక్మాంగద

సీతారామ స్తవరాజం

పంచముఖి శ్రీ ఆంజనేయ దండకం

స్మృతి పద్యాలు

మేలుకొలుపులు

జోలపాటలు

మంగళహారతులు

ప్రార్థనా గీతాలు

కీర్తనలు

ఈ రచనలు ఆయన సాహిత్య పరిధి ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తాయి. 

    అవధానిగా ప్రతిభ

కేశవదాసు గారు అష్టావధానం వంటి సాహిత్య ప్రక్రియలలోనూ ప్రతిభ కనబరిచారు. కందిబండ, హుజూర్‌నగర్, బేతవోలు, సూర్యాపేట పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలోనూ అవధాన కార్యక్రమాలు నిర్వహించినట్లు జీవిత చరిత్రలు తెలియజేస్తున్నాయి.

అవధానం అనేది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, భాషా పరిజ్ఞానం, కవితా సామర్థ్యాలను పరీక్షించే విశిష్ట సాహిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆయన చూపిన ప్రతిభ ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. 

      ఆయన హరికథా గానం ద్వారా వచ్చిన ఆదాయంతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేసినట్లు జీవిత చరిత్రలో ప్రస్తావన ఉంది. తమ్మరలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మాణానికి కూడా ఆయన కృషి చేసినట్లు పేర్కొనబడింది. 

ఈ సేవలు ఆయనకు కళల పట్ల ఉన్న అభిరుచితో పాటు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను కూడా తెలియజేస్తాయి.

       దాసు గారికి బంధుమిత్రులు, సన్నిహిత కుటుంబాల వారు ఆంధ్రదేశంలో అసంఖ్యాకంగా ఉన్నప్పటికి ఆయనకు ప్రత్యేకంగా శిష్యవర్గం అంటూ ఉన్నట్లు కనబడదు.

       ఆయన కూడా ఫలానా వారు నా శిష్యులని చెప్పనూ లేదు. అయితే అనేకమంది తన వద్దకు వచ్చి ఉపదేశాల్లాంటివి పొందడమో, తాము వ్రాసిన గ్రంథాలను పరిష్కరింప చేసుకోవడమో చేసినవారున్నారు. ఒకసారి సినిమా పని మీద కలకత్తా వెళ్ళి కొన్ని మాసాలు ఉండి కొంత ధనాన్ని సంపాదించుకొని తిరుగు ప్రయాణంలో, ఆ డబ్బుతో కలకత్తాలోని తమ్మరస్వామికి భూచక్రగొడుగు, చామరులు ఇంకా ఏవో ఆలయానికి ఉపయోగపడే పరికరాలు కొనుక్కొని నేరుగా తమ్మర గ్రామం వచ్చి స్వామికి అప్పగించి మరీ ఇంటికి వెళ్ళారట. ఎంతటి స్వార్థత్యాగం ఆయనది ఎంత స్వామి భక్తి తమ్మరలో స్వామి ఆలయ గోపుర నిర్మాణానికి ధనం చాలాకపోతే, తమ్మర గ్రామంలోనే ఉండి జక్కేపల్లిలోని తమ యింటికి మనిషిని పంపి తమ అర్థాంగి చిట్టెమ్మ గారి చేతికి ఉన్న బంగారు గాజులు తెప్పించి వాటిని అమ్మి ఆ డబ్బుతో నిర్మాణం పూర్తి చేయించాడు “చా యౌ పతి రవ్వగా” అని రామాయణంలో సీతమ్మను గురించి చెప్పబడినట్లుగా భర్త యాజ్ఞను శిరసావహించి ఎటువంటి అడ్డు చెప్పకుండా తన గాజులను రామకార్యార్థమై సమర్పించిన ఆ మహాఇల్లాలు యౌద్యామెంత స్తుతిపాత్రము. ఆయన ధన సంపాదనకు, కీర్తి సంపాదనకో రాజా స్థానాలను దర్శించలేదు. కీర్తి, ధనము, రెండింటికి పై మెట్టుగానే ఆయన జీవించినట్లు ఎన్నో సంఘటనలు తెలుపుతున్నాయి. దాసుగారు, బేతవోలు, లింగగిరి, కందిబండ, అనంతగిరి, తిరువూరు, గంపలగూడెం, మైలవరం, ఘనపురం, సిరిపురం మున్నగు సంస్థానములు వారి పిలుపుపై సందర్శించి పెక్కు సన్మానాలు, బిరుదులు పొందారు. ఆ సందర్భంగా లభించిన బంగారు కంకణాలు, పతకాలు తన వద్ద ఎక్కువ కాలం ఉంచుకోక అవసరమొచ్చినప్పుడు అమ్మి ఏదో ఒక సత్కారక్రమానికి వినియోగిస్తూ వచ్చారు.

    కేశవదాసుగారు తన జీవిత చరమాంకలో తమ రెండవ కుమారుడైన చందాల కృష్ణమూర్తి గారింట్లో ఉంటూ తమ 80వ ఏట “విజయనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి తిథి"నాడు 14-6-1956 సం|| తమ పార్థీవ శరీరాన్ని వదిలి తన ఇష్ట దైవమైన సీతారామచంద్రస్వామి వారి దివ్యతేజః పుంజములో కలిసిపోయారు.

      మహాభక్త కవిశేఖరుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన చందాల కేశవదాసు గారి శరీరంతో పాటు ఆయన కీర్తి కూడా త్వరగానే కనుమరుగైపోవడం కళాప్రియులకు భేదం కలిగించే విషయం. ఇంతటి చిరస్మరణీయుడైన దాసు గారి ఘనతను గుర్తించక పోవడం ఈ తరం వారి పరాకేనని చెప్పక తప్పదు.

పొన్నూరి రాఘవేంద్ర